Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్‌పై హోంశాఖ సమావేశం పూర్తి

Advertiesment
క్రీడలు క్రికెట్ వార్తలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సీజన్ భద్రత కేంద్రం హోంశాఖ చిదంబరం ఎన్నికలు క్రికెట్ మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ భద్రతపై కేంద్ర హోంశాఖా మంత్రి పి.చిదంబరం శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భద్రతా సంస్థల ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ రెండో సీజన్ రెండూ ఒకేసారి జరుగుతుండటంతో క్రికెట్ మ్యాచ్‌లకు భద్రత కల్పించడం సమస్యగా మారిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ భద్రతపై కేంద్ర హోం శాఖ గతంలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నివేదిక కోరింది. మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రాలు పంపిన నివేదికలను తాజా సమావేశంలో హోం శాఖ పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులతో హోం మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.

ఏఫ్రిల్ నెలలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లకు భద్రత కల్పించేందుకు చాలా రాష్ట్రాలు అదనపు కేంద్ర బలగాలు పంపాలని తమ నివేదికల్లో పేర్కొన్నాయి. లేకపోతే ఐపీఎల్ నిర్వహణ కష్టమవుతుందని అవి తేల్చి చెప్పాయి.

ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, రా (ఆర్ఏడబ్ల్యూ) చీఫ్‌లతోపాటు ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఐపీఎల్ భద్రతపై హోం శాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా సంప్రదింపులు జరిపారు.

అదనపు భద్రతా సిబ్బందిని కేటాయించకుండా, ఈ టోర్నీ మ్యాచ్‌లకు భద్రత కల్పించడం సాధ్యపడదని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇదివరకే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కారణంగా ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ససేమిరా అనడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గురువారం ఐపీఎల్‌పై అభ్యంతరం లేవనెత్తిన విషయం తెలిసిందే. ఇక, మిగిలిన రాష్ట్రాలు మాత్రం అదనపు భద్రత కల్పించినపక్షంలో ఐపీఎల్‌కు భద్రత కల్పిస్తామని ప్రతిపాదనలు పంపాయి.

Share this Story:

Follow Webdunia telugu