ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్‌లకు రంగం సిద్ధం..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా.. సెమీఫైనల్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. ముంబైలో జరుగనున్న ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్‌లకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉండటంతో.. పోలీసు యంత్రాంగం అప్రమత్తమై స్టేడియం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.మరోవైపు.. బెంగళూరు నుంచి భద్రతా కారణాల దృష్ట్యా ముంబైకి తరలించిన ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్‌ల టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా పొందవచ్చునని ఐపీఎల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సెమీఫైనల్లో భాగంగా.. ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో తొలి రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను వీక్షించాలనుకునే అభిమానులు, ప్రేక్షకులు డి.వై. పాటిల్ స్టేడియం కార్యాలయంలోనూ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐపీఎల్‌టీ20.కామ్ అనే వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇంకా టిక్కెట్ ధరను వందరూపాయలుగా నిర్ణయించారు. అలాగే ఏప్రిల్ 24వ తేదీన జరిగే చివరి సెమీఫైనల్ మ్యాచ్‌తో పాటు, ఏప్రిల్ 25వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌లకు కూడా ఇదే పద్ధతిలో టిక్కెట్లను పొందవచ్చునని ఐపీఎల్ యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.