ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌కు మళ్లీ ఆటంకాలు ఎదురయ్యాయి. శుక్రవారం జరిగిన సమావేశంలో... ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, మళ్లీ షెడ్యూల్‌ను మార్చాలని కేంద్ర హోంశాఖ ఐపీఎల్ బోర్డుకు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
లీగ్ పోటీలకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడం సాధ్యంకాదని దాదాపు అన్ని రాష్ట్రాలు చెప్పడంతో... మ్యాచ్‌ల తేదీలను మళ్లీ మార్చక తప్పదని హోంశాఖ సూచించింది. ఎన్నికల తేదీలలో ఆయా వేదికలలో మ్యాచ్‌లు లేకుండా చూస్తూ, ఆ మేరకు మార్పులు చేసిన తమకు సమర్పించిన షెడ్యూల్‌ను ఆమోదించటం లేదని హోంశాఖ వెల్లడించింది.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా ఐపీఎల్ ఆతిథ్య రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వారి అభ్యంతరాలను తెలుసుకున్నారు. సాధ్యాసాధ్యలన్నీ పరిశీలించిన మీదటే ఐపీఎల్ బోర్డును రెండోసారి షెడ్యూల్లో మార్పులు చేయాల్సిందిగా సూచిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
కాగా... ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు ఎంకె నారాయణన్, గూఢచారి సంస్థ 'రా' ప్రధానాధికారి హోం మంత్రి చిదంబరం, కార్యదర్శి మధుకర్ గుప్తా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే... భద్రతపై ప్రభుత్వం చేతులెత్తేయడంతో, ఐపీఎల్ కమీషనర్ లలిత్ మోడీ ఆఘమేఘాలపై ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతోపాటు లీగ్ సీఈఓ సుందర్ రామన్ కూడా బయలుదేరి వెళ్ళారు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం కోసం వీరు ఢిల్లీలో హోంమంత్రి పి. చిదంబరంతో భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.