ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త లోగోను ఆవిష్కరించడంతోపాటు, రెండో సీజన్‌ను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ మంగళవారం ప్రకటించారు. ఇందులో భాగంగా మోడీ ఆరు సరికొత్త వేదికలను వెల్లడించారు.
ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రారంభ, ముగింపు వేడుకలు ముంబయి నగరంలో జరుగుతాయని మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏఫ్రిల్ 10వ తేదీన ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరుగుతాయనీ... ఢిల్లీ, ముంబయి, చండీఘర్, జైపూర్, కోల్‌కత, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, విశాఖపట్నంలలో ట్వంటీ20 మ్యాచ్‌లు జరుగుతాయని ఆయన వివరించారు.
ఆటగాళ్ల భద్రతకు సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకుంటామని, అన్ని జట్లకూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామనీ.. మోడీ ఈ మేరకు హామీనిచ్చారు. ఆటగాళ్లు దేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లేవరకు వారి పూర్తి బాధ్యత తమదేనని పేర్కొన్నారు. ఆటగాళ్ల భద్రత కోసం తాము గతంలో వెచ్చించిన నిధులకంటే పదిరెట్లు ఎక్కువగా కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.
"ప్రతి రాష్ట్ర ప్రభుత్వంతో ఐపీఎల్ భద్రతపై చర్చలు జరిపాము. తుది నిర్ణయం తీసుకునే ముందు వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాము. అయితే తుది షెడ్యూల్‌ను ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం చేయలేదని, దానిపై కసరత్తు జరుగుతోంద"ని మోడీ పేర్కొన్నారు.
ఐపీఎల్ రెండో సీజన్లో రెండు కొత్త వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. అహ్మదాబాద్, విశాఖపట్నం నగరాలు కూడా ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని దక్కించుకున్నాయి. మెరుగైన రూపు ఇచ్చేందుకు షెడ్యూల్‌పై కసరత్తు ఇంకా జరుగుతోందని, ధర్మశాలలోనూ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉందని మోడీ తెలిపారు. మే 16న మినహా ఐపీఎల్ షెడ్యూల్లోని ప్రతి రోజూ మ్యాచ్‌లు ఉంటాయని చెప్పారు.
ట్వంటీ20 మ్యాచ్‌ల కోసం వచ్చే వారం నుంచి టిక్కెట్ల అమ్మకాలు మొదలవుతాయని మోడీ వెల్లడించారు. స్టేడియాల్లో సీట్ల కేటాయింపును కూడా సాంకేతికంగా ఆధునికీకరించనున్నట్లు, దీని వలన అభిమానులు వారి సీట్లు ఎక్కడున్నాయో తెలుసుకోవడం సులభతరం అవుతుందని మోడీ వెల్లడించారు.