ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పలు రాష్ట్రాలు ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని చేతులెత్తేస్తున్న తరుణంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ముందుకు రావడం ఐపీఎల్ నిర్వాహకులకు ఊరట కలిగించే అంశం. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తే తాము పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది.
రాయ్‌పూర్ శివార్లలో కొత్తగా నిర్మించిన స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను గట్టి భద్రత మధ్య నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనిపై ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీతో మా ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఫోన్‌లో సంప్రదించి తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్టు ఛత్తీస్‌గఢ్ స్టేట్ క్రికెట్ సంఘ్ (సి.ఎస్.సి.ఎస్) అధ్యక్షుడు బల్దేవ్ సింగ్ భాటియా మీడియాకు వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్‌లో మ్యాచ్‌ల నిర్వహణకు కు ఐపీఎల్ నిర్వాహకులు అవకాశం కల్పిస్తే క్రికెట్ ఆటగాళ్లు, నిర్వాహకులకు పూర్తిభద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఏప్రిల్-మే నెలల్లో జరుగనున్న ఈ టోర్నీకి ఎంపిక చేసిన ఇతర వేదికల కంటే ఛత్తీస్‌గఢ్ ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.
సుమారు 60 వేల మంది కూర్చొనే విధంగా సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఈ కొత్త స్టేడియం గత యేడాది సెప్టెంబరు నెలలో ప్రారంభించగా, రాష్ట్రంలో ఉన్న తొలి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఇదే కావడం గమనార్హం.