ఐపీఎల్ విషయంలో గుజరాజ్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయాలతో ఆ రాష్ట్ర డీజీపీ విభేదించారు. నరేంద్ర మోడీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ విదేశాలకు తరలివెళ్లడంపై కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చేరిగిన సంగతి తెలిసిందే. దేశం నుంచి ఐపీఎల్ వెళ్లిపోవడం జాతికే అవమానకరంగా అభివర్ణించారు.
అయితే గుజరాత్ డీజీపీ మాత్రం ఎన్నికలు జరిగే సమయంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడంపై మోడీకి భిన్నమైన అభిప్రాయం కలిగివున్నారు. రాష్ట్ర డీజీపీ ఎస్ఎస్ ఖాందవాలా మార్చి 17న గుజరాత్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు నరహరి అమీన్‌కు రాసిన లేఖలో.. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏప్రిల్ 15 నుంచి మే- 3 వరకు భద్రత కల్పించే స్థితిలో తాము లేమని చెప్పారు.
అందువలన ఏప్రిల్ 22న ప్రతిపాదించిన మ్యాచ్‌ను ఏప్రిల్ 10 ముందు లేదా మే- 3 తరువాత నిర్వహించాలని సూచించారు. ఇకపోతే ఏప్రిల్ 11, 13, మే 6, 12 తేదీల్లో గుజరాత్ జరగాల్సిన మిగిలిన మ్యాచ్‌లకు భద్రత కల్పించగలమని హామీ ఇచ్చారు. గుజరాత్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 30న జరగనున్నాయి.
ఇదిలా ఉంటే బీసీసీఐ ఐపీఎల్ రెండో సీజన్‌ను విదేశాలకు తీసుకెళుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం మాట్లాడుతూ... అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లను గుజరాత్‌లో నిర్వహించుకునేందుకు బీసీసీఐకి ఆహ్వానం పలికారు.
భారత్ వంటి శక్తివంతమైన దేశం ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రత కల్పించలేకపోవడం అవమానకరమన్నారు. అయితే డీజీపీ లేఖ మోడీ ప్రతిపాదనకు భిన్నంగా ఉండటంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. తాజా పరిణామాన్ని మోడీ రాజకీయ ప్రయోజనాలకు, ప్రచారానికి వాడుకుంటున్నారని ఆరోపించింది.