దేశవ్యాప్తంగా ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీ కార్యాలయాలపైనా ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సికిందరాబాదులోని డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంఛైజీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
కోల్‌కతా చెందిన నైట్ రైడర్స్ కార్యాలయంపై కూడా ఐటీ శాఖ దాడులు జరిపినట్టు తెలుస్తున్నది. అలాగే శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలను కూడా ఐటీ అధికారులు ప్రశ్నించారు.
మోడీ ప్రారంభించిన ఐపీఎల్ వివాదం కేంద్రమంత్రి శశి థరూర్ పదవిని బలితీసుకోవడంతోపాటు ఆయననూ చుట్టుకుంది. ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారన్న అనుమానాలే కాక బెట్టింగ్, కోట్లకొద్దీ నల్లధనం చేతులు మారాయన్న ఆరోపణల నేపధ్యంలో మోడీ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి.
మొత్తమ్మీద ఐపీఎల్ క్రీడలో నల్లధనం ఏరులై పారినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆదాయపు పన్ను శాఖ ఒకేసారి దేశంలోని ఐపీఎల్ ఫ్రాంఛైజీలపై దాడులు చేయడం గమనార్హం.