Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ జట్టులో నలుగురు విదేశీ క్రికెటర్లుండాలి: సచిన్

Advertiesment
సచిన్ టెండూల్కర్
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 క్రికెట్ జట్టులో నలుగురు విదేశీ క్రికెటర్లు ఉండాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-4లో కొత్త ఫ్రాంచైజీలు రావడంతో ఒక ఐపీఎల్ జట్టు కనీసం 8 మంది పటిష్టమైన క్రికెటర్లనైనా.. సిద్ధంగా ఉంచుకోవాలని సచిన్ పేర్కొన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌ ఆదివారంతో సమాప్తం కానున్న నేపథ్యంలో.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ యజమానులకు కొన్ని సలహాలిచ్చాడు. ఐపీఎల్-2010 సీజన్ ముగియనున్న తరుణంలో వచ్చే ఏడాదికి నూతన ఐపీఎల్ జట్లు ఎంపికకావడంతో ఫ్రాంచైజీలు, యజమానులు అప్రమత్తం కావాలని చెప్పాడు.

ఐపీఎల్ నాలుగో సీజన్‌లో పూణే, కొచ్చి ఫ్రాంచైజీ జట్లు చేరనున్న తరుణంలో జట్టు యజమానులు కనీసం 8 మంది క్రికెటర్లనైనా పకడ్బందీగా ఉంచుకోవాలన్నదే తన అభిప్రాయమన్నాడు.

పూణే, కొచ్చి ఫ్రాంచైజీ జట్లలో చేరేందుకు కొందరు క్రికెటర్లు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో.. ప్రతి ఐపీఎల్ జట్టులోనూ 8 మంది క్రికెటర్లనైనా దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు చర్యలు తీసుకోవాలని సచిన్ చెప్పాడు. ఇందులో నలుగురు భారత క్రికెటర్లు, మరో నలుగు విదేశీ క్రికెటర్లు తప్పకుండా ఉండాలని సచిన్ పేర్కొన్నాడు.

ప్రతీ ఐపీఎల్ జట్టులోనూ 8 మంది సభ్యులను మిగుల్చుకోవడం ఎప్పటికీ మంచిదని సచిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒక జట్టును సృష్టించడమనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. ఇంకా ఒక జట్టును ఏర్పరచడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని సచిన్ అన్నాడు.

గత మూడు ఐపీల్ సీజన్‌లలో జట్ల నిర్మాణానికి ఏర్పాటుకు ఎంతో కృషి జరిగి ఉంటుందని సచిన్ చెప్పుకొచ్చాడు. అందుచేత ఐపీఎల్ జట్లలో మార్పులు, చేర్పులను తగ్గించుకోవడం చాలా మంచిదని సచిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మూడో సీజన్‌లో సచిన్ టెండూల్కర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఫైనల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25వ తేదీన జరిగే ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్.. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu