ఐపీఎల్ ఛైర్మన్ పదవికి నేడు లలిత్ మోడీ రాజీనామా..!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ పదవికి లలిత్ మోడీ మంగళవారం రాజీనామా చేయనున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. మూడు సంవత్సరాల్లోనే లలిత్ మోడీ కోట్లు సంపాదించారని, బెట్టింగ్‌ల్లోనూ పాలు పంచుకున్నారని ఆరోపణలను వెల్లువెత్తడంతోపాటు ఆదాయ పన్ను శాఖ కీలక అంశాలను బయటపెట్టడంతో లలిత్ మోడీ తన పదవికి నేడే స్వస్తి చెప్పనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న లలిత్ మోడీ.. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీకి చేరుకున్న వెంటనే తన రాజీనామాను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది. కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి, అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) కాబోయే అధ్యక్షులు శరద్ పవార్ లలిత్ మోడీకి చేయూతనిచ్చేందుకు వెనుకడుగు వేయడంతో మోడీ రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇకపోతే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కూడా లలిత్ మోడీ అవకతవకలను ఎండగట్టేందుకు సన్నాహాలు చేస్తుండటంతో.. ఛైర్మన్ పదవి నుంచి మర్యాదగా తప్పుకోవాలని మోడీ భావిస్తున్నారు. కాగా.. బెట్టంగ్‌లు, బ్లాక్ మనీ వివాదం, శశిథరూర్‌తో కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారాల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీ తన పదవికి రాజీనామా చేస్తారా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే..!.