ఐపీఎల్-3లో మొత్తం 572 సిక్సర్లు, 1685 బౌండరీలు నమోదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో మొత్తం 572 సిక్సర్లు నమోదయ్యాయి. మార్చి 12 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు జరిగిన ఐపీఎల్-3లో మొత్తం 60 మ్యాచ్‌లు జరిగాయి. కళ్లు చెదిరే ఆటతీరుతో క్రికెటర్లు క్రీజులో రాణించడంతో ఐపీఎల్-3లో మొత్తం 572 సిక్సర్లు నమోదైనట్లు గణాంకాల ఆధారంగా తెలిసింది. ఇందులో టీం ఇండియా సూపర్ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన అద్భుత సిక్సర్ కూడా ఉండటం విశేషం. పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ 108 మీటర్ల దూరంలో బంతిని ఎగిరేలా చేసి, సూపర్ సిక్సర్‌ను నమోదు చేసుకున్నాడు.ఇక.. ఐపీఎల్-3లో ఏయే జట్లు ఎన్నెన్ని సిక్సర్లు కొట్టాయనే విషయానికొస్తే..? చెన్నై సూపర్ కింగ్స్-7 సిక్సర్లు, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్-7, డెక్కన్ ఛార్జర్స్-4, ఢిల్లీ డేర్‌డెవిల్స్-8, ముంబై ఇండియన్స్-0, రాజస్థాన్ రాయల్స్-4, కింగ్స్ ఎలెవన్ పంజాబ్-7 సిక్సర్లు సాధించాయి. అలాగే.. ఐపీఎల్ మూడో సీజన్లో మొత్తం 1685 బౌండరీలు నమోదయ్యాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్-12, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-14, డెక్కన్ ఛార్జర్స్-97, ఢిల్లీ డేర్‌డెవిల్స్-90, ముంబై ఇండియన్స్-49, కోల్‌కతా నైట్‌రైడర్స్-99, రాజస్థాన్ రాయల్స్-02, కింగ్స్ ఎలెవన్ పంజాబ్-33 ఫోర్లు సాధించాయి. కాగా.. ఐపీఎల్ నాలుగో సీజన్లో కొత్తగా పూణే, కొచ్చి జట్లు చేరుతాయి. దీంతో నాలుగో సీజన్లో మ్యాచ్‌ల సంఖ్య 94కి పెరుగుతాయి. ఇంకా కొత్తగా అన్ని జట్లకు చెందిన క్రికెటర్ల వేలం జరుగనుంది. ఇందులో ప్రతి జట్టులోనూ నలుగురు భారత క్రికెటర్లు, ముగ్గురు విదేశీ క్రికెటర్లకు అవకాశం లభిస్తుందని తెలిసింది.