ఐపీఎల్-3: సరికొత్త పరుగుల రికార్డు సృష్టించిన ధోనీసేన!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సరికొత్త పరుగుల రికార్డును సృష్టించింది. చెన్నై క్రికెట్ వీరులు మురళీ విజయ్, మోర్కెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ 246 పరుగుల భారీ స్కోరును సాధించిన తొలి ఐపీఎల్ జట్టుగా సరికొత్త రికార్డును లిఖించుకుంది.మురళీ విజయ్ సెంచరీ, మార్కెల్‌ల సూపర్ ఇన్నింగ్స్ ఆడి.. జట్టుకు భారీ స్కోరును సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఇంకా వీరిద్దరి అద్భుత భాగస్వామ్యంతో చెన్నై సూపర్ కింగ్స్ మూడో వికెట్‌కు 152 పరుగులను నమోదు చేసుకుంది.చెన్నైలోని చేపాక్కం మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం జరుగుతున్న 32వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు మురళీ విజయ్- మాథ్యూ హేడెన్ భాగస్వామ్యం శుభారంభాన్నిచ్చింది. మాథ్యూ హేడెన్ 21 బంతుల్లో 34 పరుగులు సాధించి వాగ్ బౌలింగ్‌లో అవుటైయ్యాడు. తర్వాత బరిలోకి దిగిన సురేష్ రైనా ఏడు బంతుల్లో 13 పరుగుల వద్ద షేన్ వార్న్ పెవిలియన్ ముఖం పట్టాడు. వీరిద్దరూ కలిసి 64 బంతుల్లో 152 పరుగులు సాధించి రికార్డు సృష్టించారు. మురళీ విజయ్ సిక్సర్లు, బౌండరీలతో చెన్నై సూపర్ కింగ్స్ రన్‌రేట్‌ను శరవేగంగా పెంచాడు. మోర్కెల్ 34 బంతుల్లో 62 పరుగులు సాధించి రనౌటయ్యాడు.మ్యాచ్ చివరి ఓవర్ వరకు మురళీ విజయ్ అద్భుత ఇన్నింగ్స్ ప్రేక్షకులను కనువిందు చేసింది. చివరి ఓవర్లో షేన్ వాట్సన్ చేతిలో అవుటైన విజయ్ కేవలం 56 బంతుల్లో 127 పరుగుల భారీ స్కోరును సాధించాడు. విజయ్ అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్ చివరి పది ఓవర్లలోనే సూపర్ కింగ్స్ 157 పరుగులు సాధించింది. మొత్తానికి ఐపీఎల్ ట్వంటీ-20 పరిమిత ఓవర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఫలితంగా మహేంద్ర సింగ్ ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 246 పరుగులు సాధించింది. దీంతో ఐపీఎల్ పోటీల్లోనే భారీ స్కోరును సాధించిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఇందులో 17 సిక్సర్లు, 19 బౌండరీలు కూడా స్థానం సంపాదించడం గమనార్హం. చివరి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా బౌలర్ షేన్ వాట్సన్ నాలుగు ఓవర్లలో 47 పరుగులు అందజేయడం విశేషం.