ఐపీఎల్-3 విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ టైటిల్‌ను మహేంద్ర సింగ్ ధోనీ సేన చెన్నై సూపర్ కింగ్స్ గెల్చుకుంది. వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌కు షాక్ ఇచ్చిన ధోనీ సేన తొలిసారిగా ఐపీఎల్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. ముంబైలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 22 పరుగుల తేడాతో సచిన్ సేనను మట్టికరిపించింది. ఫలితంగా ఐపీఎల్-3 టైటిల్ విజేత నెగ్గేది ఎవరన్న అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన హోరాహోరి పోరులో చెన్నై సూపర్‌కింగ్స్ 22 పరుగుల తేడాతో సచిన్ సేనపై విజయం సాధించింది. సురేశ్‌రైనా (57నాటౌట్: 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధీటుగా రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు సమిష్టిగా రాణించడంతో అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది. సచిన్ (48) ఒక్కడే జట్టును ఒంటి చేత్తో నడిపించాడు. ఇంకా పొలార్డ్ (27: 10 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు), అంబటి రాయుడు (21: 14 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)లు కీలక సమయంలో పెవిలియన్ ముఖం పట్టడంతో ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబైకి ఓటమి తప్పలేదు. అంతకు ముందు స్టార్ కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హేడెన్-మురళీ విజయ్‌లు ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించారు. విజయ్ (26: 19 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), ధోనీ (22: 15బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)లు మోస్తరుగా రాణించారు. రైనా (57) అజేయంగా నిలిచాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి, 168 పరుగులు సాధించింది. ఇకపోతే.. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఫెర్నాండో రెండు వికెట్లు సాధించగా, జహీర్ ఖాన్, పోలార్డ్‌లు చెరో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. చెన్నై బౌలర్లలో జకాతి ఒకటి, బోలింగర్, మోర్కెల్, సురేష్ రైనా, మురళీధరన్‌లు తలా ఒక్కో వికెట్‌ను సాధించారు. ఇదిలా ఉంటే.. 35 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో అద్భుతంగా రాణించిన చెన్నై సూపర్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.