ఐపీఎల్-3: రాయల్ ఛాలెంజర్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచెల పోటీల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయపరంపర కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, మూడు పరాజయాలతో రెండో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన 35వ లీగ్ మ్యాచ్‌లో గెలుపొందింది. దీంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 37 పరుగుల తేడాతో గెలిచింది. కాలింగ్‌వుడ్ (75 నాటౌట్: 46 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (33: 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సెహ్వాగ్ (35: 22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు ధీటుగా రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన బెంగళూర్ ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరు ఆటగాళ్లలో కలిస్ (54: 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా, రాస్ టేలర్ (22: 10 బంతుల్లో 3 సిక్స్‌లు)లు మాత్రమే రాణించారు. మిగిలిన బెంగళూరు ఆటగాళ్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. దీంతో బెంగళూరుకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతిలో ఓటమి తప్పలేదు.ఇకపోతే.. సూపర్ బ్యాటింగ్‌తో ఢిల్లీ జట్టుకు విజయం సాధించిపెట్టిన కాలింగ్‌వుడ్ (75)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా.. బెంగళూరు బౌలర్లలో కుంబ్లే, మిథున్, అప్పన్నలు తలా ఒక్కో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లలో అమిత్ మిశ్రా, సంగ్వాన్‌లు ఏకంగా మూడేసి వికెట్లు పడగొట్టగా, మహరూఫ్, వెటోరి, భాటియాలు తలా ఒక్కో వికెట్ చొప్పున మూడు వికెట్లు సాధించారు.