ఐపీఎల్-3: ముంబయిపై పంజాబ్ ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో వరుస ఓటములతో సతమతం అవుతున్న సినీనటి ప్రీతిజింటా ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనూహ్య రీతిలో ఘన విజయం సాధించింది. ఇప్పటికే సెమీస్ అవకాశాలను చేజార్చుకున్న పంజాబ్, ఐపీఎల్-3 పట్టికలో మొట్టమొదటి స్థానంలో ఉన్న పటిష్టమైన ముంబయి జట్టుపై 6 వికెట్ల తేడాతో గెలుపొంది కాస్తంత ఊరట పొందింది.ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే సాధించింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని అధిగమించింది. కాగా.. సంగక్కర కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో చెలరేగి ఆడి, పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు సంగక్కరనే వరించింది.కాగా.. ఐపీఎల్‌లో వరుస విజయాలతో ముందంజలో ఉన్న సచిన్ టెండూల్కర్ సారధ్యంలోని ముంబయి ఇండియన్స్ జట్టు ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. ఓపెనర్ ధావన్ 2, తివారీ 4 పరుగులతోనే పెవిలియన్ చేరారు. ఆ తరువాత బరిలో దిగిన కెప్టెన్ సచిన్ 29 పరుగులకే వెనుదిరిగాడు. మరోవైపు చెలరేగి ఆడిన రాయుడు 33 పరుగులు, డుమినీ 35, సతీష్ 20, పొలార్డ్ 18 పరుగులకే ఔటయ్యారు. ఇక పంజాబ్ బౌలర్లలో ఇర్ఫాన్, పియూష్ చావ్లాలు మూడేసి వికెట్లు పడగొట్టారు.