ఐపీఎల్-3: బెంగళూరు-ఢిల్లీ జట్ల మధ్య సమరం నేడే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మూడో అంచె పోటీలలో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరుగనుంది. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో గెలుపుపై ధీమా ఉంది. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచినా, ఆ తరువాత వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సరే గెలుపొందాలనే పట్టుదలతో ఉంది.ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ గౌతం గంభీర్ గాయాల బారిన పడటంతో ఆ జట్టు కాస్త ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ జట్టులో డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కడే మెరుగ్గా రాణిస్తుంటే, మిగతా ఆటగాళ్లు విఫలం అవుతున్నారు. దీంతో ఆ జట్టును ఓటమి వీడటం లేదు. ఐపీఎల్-2లో సత్తా చాటుకున్న డివిలియర్స్ మూడో అంచె పోటీలలో మాత్రం అంతంమాత్రంగానే రాణిస్తున్నాడు. దీంతో ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్‌లో గెలుపొందాలంటే గట్టి పోరాటమే చేయాల్సి ఉంది.మరోవైపు బెంగళూర్ జట్టు నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో సమతూకంగా ఉన్న ఈ జట్టులో కలిస్ అద్భుత ఫామ్‌తో చెలరేగి ఆడుతున్నాడు.ఐపీఎల్-3లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లలో చాలా వాటిలో అతను ఒంటి చేత్తో జట్టుకి విజయాన్ని అందించాడంటే అతిశయోక్తి కాదు. అలాగే ఈ జట్టులో మనీష్ పాండే, ఊతప్ప కూడా నిలకడగా రాణిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో వినయ్, ప్రవీణ్ మెరుపులు మెరిపిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు ఢిల్లీకే మెరుగ్గా ఉన్నాయి.