ఐదు మ్యాచ్‌ల ఓటమితోనే సెమీస్‌లోకి ప్రవేశించాం.!: గిల్‌క్రిస్ట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా ఐదు లీగ్ మ్యాచ్‌ల్లో పరాజయం కావడమే సెమీఫైనల్లోకి ప్రవేశించేందుకు ప్రధాన కారణమైందని డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ గిల్ క్రిస్ట్ అన్నాడు. ఎలాగంటే..? ఐపీఎల్-3లో ఐదు లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ద్వారా తమ జట్టు ఆటగాళ్లకు మైండ్ ఫ్రీ అయ్యిందని గిల్ చెప్పాడు. ఐదు మ్యాచ్‌ల్లో పరాజయం పాలవడం ద్వారా ఓటమి బాధను పూర్తిగా అనుభవించేశారని, అనంతరం ఫ్రీ మైండ్‌తో క్రీజులో రాణించారని గిల్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఆటగాళ్లు రాణించడంతో గెలుపును నమోదు చేసుకుని సెమీఫైనల్లోకి దూసుకెళ్లామని కెప్టెన్ అన్నాడు. ఐదు మ్యాచ్‌ల ఓటమికి తర్వాత.. ఇక ఓడేది లేదని భావన తమలో ఏర్పడిందని గిల్‌క్రిస్ట్ అన్నాడు. దీంతో ఒత్తిడి మాయమై.. విజయాలపై దృష్టి పెట్టగలిగామని కెప్టెన్ చెప్పాడు. 1999
ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియా జట్టు ఏడు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ట్రోఫీని సొంతం చేసుకోగలమనే పరిస్థితుల్లో స్టీవ్ వాగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా పట్టుదల ఆడిందని గిల్‌క్రిస్ట్ ఎత్తిచూపాడు. ప్రారంభంలో ఓటమిని చవిచూసినప్పటికీ.. టైటిల్ గెల్చుకోవాలనే ఉద్దేశంతో ఆడిన ఆస్ట్రేలియా 1999లో ప్రపంచకప్‌ను గెల్చుకుందని గిల్ అన్నాడు. ఇదే తరహాలో ఐపీఎల్-3లో తమ జట్టుకు ఆ అవకాశం లభిస్తుందా? అనే ప్రశ్నకు గిల్ సమాధానమిస్తూ.. ప్రపంచకప్‌కు-ఐపీఎల్ టైటిల్‌కు పోలికలు ఉండవచ్చునని దాటవేశాడు. అయితే ప్రస్తుతానికి విజయమే లక్ష్యంగా ఆటగాళ్లు బరిలోకి దిగుతారని గిల్ స్పష్టం చేశాడు.