ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ వేదికపై మంగళవారం రాత్రిలోగా నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడి వెల్లడించారు. ఆయన సోమవారం ఇక్కడ నుంచి దక్షిణాఫ్రికా బయలుదేరి వెళుతున్న సందర్భంగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. దీనిపై రేపు రాత్రిలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వేదికలను పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండింటిలో ఏదో ఒక దానిని వేదికగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. తాను ఇప్పటికే ఐపీఎల్ గురించి క్రికెట్ సౌతాఫ్రికా సీఈవో గెరాల్డ్ మజోలాతో మాట్లాడానని, జోహనెస్‌బర్గ్‌లో మంగళవారం ఉదయం సమగ్ర చర్చలు జరుపుతానని తెలిపారు.
ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల్లో వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తున్నాము. ఈ అంశమే ప్రస్తుతానికి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా రెండు దేశాల్లోనూ భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఆస్ట్రేలియా పర్యటన ఏప్రిల్ మధ్యకాలంలో ముగుస్తుంది. రెండు దేశాలకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయని, వీటిని పరిశీలించడానికి అక్కడికి వెళుతున్నట్లు మోడి వెల్లడించారు. ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా రెండూ ఉత్సాహం చూపుతున్నాయని చెప్పారు.