ఇంకా ఎందుకూ... రాజీనామా చేయవయ్యా బాబూ...!!
లలిత్ మోడీ పదవి ఊడిపోయే ఘడియలు దగ్గరపడుతున్నాయి. మొన్నటివరకూ మోడీకి ఎంతో సన్నిహితంగా మెలిగినవారు సైతం "మోడీ... ఇంకా ఎందుకు.. రాజీనామా చేయవయ్యా బాబూ" అని అంటున్నారట. ఇదిలావుంటే మోడీని ఐపీఎల్ కమిషనర్ పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర వ్యవసాయశాఖామాత్యులు, కాబోయే ఐసీసీ అధ్యక్షుడు శరద్ పవార్ సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, హోం మంత్రి చిదంబరంతో సమావేశమై మోడీ వ్యవహారంపై చర్చించారు. తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 26వ తేదీన సమావేశమవుతున్నట్లు వెల్లడించారు. ఇంత జరుగుతున్నా మోడీ మాత్రం మన్నుతిన్న పాములా నోరు మెదపటం లేదు. పైపెచ్చు బెట్టింగ్ ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుత ఐపీఎల్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే లలిత్ మోడీని తొలగించడం ఖాయమని విశ్వసనీయ సమాచారం. అయితే అంతకంటే ముందే లలిత్ మోడీ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.