జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టే.. ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే ఇంటర్నేషనల్ జట్టని మాజీ లెగ్ స్పిన్నర్ బి.ఎస్. చంద్రశేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఉన్న టీం ఇండియాలో మంచి సమతుల్యం ఉందని ఆయన కొనియాడారు.
మంగళూరులో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమం లో పాల్గొన్న చంద్రశేఖర్ మాట్లాడుతూ... టెస్టు మ్యాచ్‌లలోనూ, వన్డే మ్యాచ్‌లలోనూ స్పిన్ బౌలర్ల ప్రాధాన్యం ఇంకా తగ్గలేదని వ్యాఖ్యానించాడు. అన్ని దేశాలూ మ్యాచ్‌ల కోసం స్పిన్నర్లను జట్టులోకి తీసుకుంటుండమే ఇందుకు నిదర్శనమని అన్నాడు.
కాగా... క్రికెట్‌లో చంద్రశేఖర్ చేసిన సేవలకు గుర్తింపుగా రోటరీ క్లబ్, దక్షిణ కర్ణాటక క్రికెట్ సంఘం, రామకృష్ణ కాలేజ్‌లు సంయుక్తంగా ఆయనకు "వందన" అవార్డును బహూకరించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రశేఖర్ టీం ఇండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇదిలా ఉంటే... ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ ఇషాంత్ శర్మ రెండు ర్యాంకులను మెరుగుపరచుకుని టాప్ 20లో స్థానం సంపాదించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో అద్భుతంగా రాణించిన ఆసీస్ పేసర్ జాన్సన్, స్టెయిన్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలోనూ... మొదటి స్థానంలో స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ నిలిచాడు. బ్యాటింగ్‌లో చందర్‌పాల్, యూనిస్ ఖాన్‌ను వెనక్కి నెట్టి అగ్ర స్థానం దక్కించుకున్నాడు.