అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పే యోచనలో పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ మొహ్మద్ యూసుఫ్ ఉన్నట్టు ఆ దేశ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదేవిషయాన్ని ఆయన సన్నిహిత వర్గాలను కూడా ధృవీకరిస్తున్నాయి. అయితే, యూసుఫ్ మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అనేకంగా వచ్చే సోమవారం దీనిపై ఆయన పెదవి విప్పే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు టెస్టులు, వన్డేలు, ట్వంటీ-20లలో పరాజయం పాలైన విషయం తెల్సిందే. ఈ ఓటమికి సంబంధించి సీనియర్ ఆటగాళ్లైన యూనిస్ ఖాన్, మొహ్మద్ యూసుఫ్‌లపై జీవితకాల నిషేధం విధిస్తూ పాక్ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్యతో మనస్తాపానికి గురైన యూసుఫ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకోవాలని భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.
కాగా, 88 టెస్టులు ఆడిన యూసుఫ్ 53.07 సగటుతో 7431 పరుగులు చేశాడు. ఇందులో 24 సెంచరీలు, 32 అర్థసెంచరీలు ఉండగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు 23 పరుగులు. అలాగే, 282 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఈ క్రికెటర్ 9624 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 64 అర్థసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 141 నాటౌట్.