Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లార్డ్స్ టెస్టులో విజయానికి ఆరు వికెట్ల దూరంలో భారత్!

Advertiesment
Lord's Test
, సోమవారం, 21 జులై 2014 (09:07 IST)
క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్ మైదానంలో ఆతిథ్యం ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయానికి ఆరు వికెట్ల దూరంలో ఉంది. 319 పరుగుల లక్ష్యఛేదనలో నాలుగో రోజు ఆట చివరికి ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలంటే 6 వికెట్లు అవసరం కాగా, ఇంగ్లండ్ గెలుపునకు 214 పరుగులు కావాలి. పిచ్ పరిస్థితి దృష్ట్యా అది అసాధ్యమని క్రికెట్ పండితులు చెపుతున్నారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 295 పరుగులు, ఇంగ్లండ్ 319 పరుగులు చేయగా, భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో టెయిల్ ఎండ్ బౌలర్లు జడేజా, భువనేశ్వర్‌లు అర్థ సెంచరీల పుణ్యమాని 342 పరుగులు చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ ముంగిట భారత్ 319 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఈ మైదానంలో ఇప్పటివరకు అత్యధిక పరుగుల ఛేదన రికార్డు విండీస్ పేరిట ఉంది. 1984లో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 344 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టును చిత్తుచేసింది.
 
ఇదిలావుండగా, భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. తత్ఫలితంగా ఇంగ్లండ్‌కు 319 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ కూల్ ధోనీ 19 పరుగులకే వెనుదిరిగినా, జడేజా (68), భువనేశ్వర్ కుమార్ (52) చిరవలో మెరుపులు మెరిపించి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. ప్రత్యర్థి జట్టు ముందు భారీ టార్గెట్‌ను నిర్దేశించారు. 
 
తొలి టెస్ట్ హీరో మురళీ విజయ్ సెంచరీ దగ్గరికి వచ్చేసినా, 5 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. రెండో టెస్ట్, రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఒంటరి పోరు కొనసాగించిన విజయ్, 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలిటెస్ట్‌లో ఓ సెంచరీ, అర్థ సెంచరీలను నమోదు చేసిన విజయ్, రెండో టెస్ట్‌లో సెంచరీ చేరువలో వెనుదిరిగాడు. 

Share this Story:

Follow Webdunia telugu