సచిన్ చెప్పింది సత్యము... ఛాపెల్ నాశనం చేశాడు... భజ్జీ మద్దతు

మంగళవారం, 4 నవంబరు 2014 (19:36 IST)
టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్‌పై సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథలో తెలిపిన విషయాలకు మద్దతుగా సహచర సభ్యులు భజ్జీ, జహీర్ ఖాన్ గొంతు విప్పారు. ఇప్పటికే ఛాపెల్ వ్యవహార సరళిపై గంగూలీ వ్యాఖ్యానించగా, తాజాగా, సీనియర్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ కూడా ఆరోపణలు చేశారు. కోచ్‌గా ఛాపెల్ తన పరిమితులను అతిక్రమించాడని భజ్జీ పేర్కొన్నాడు. జహీర్ మాట్లాడుతూ, తాను కోచ్‌గా ఉండగా ఎలా ఆడతావో చూస్తానంటూ ఛాపెల్ తనను బెదిరించాడని తెలిపాడు.
 
ఛాపెల్ భారత జట్టును సర్వనాశనం చేశాడని, అది తిరిగి కోలుకోడానికి మూడేళ్ల సమయం పట్టిందని అన్నాడు. కొంతమంది గుడ్డిగా ఛాపెల్ చెప్పిన మాట వినేవాళ్లని, దానివల్ల తాము బాగా ఎదిగిపోతామని భావించారని తెలిపాడు. కానీ అలా చేయడంతో భారత క్రికెట్ ఎంత పతనం అవుతుందన్న విషయం ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన చెందాడు.
 
హర్భజన్ మరో విభ్రాంతికర విషయం కూడా బయటపెట్టాడు. జింబాబ్వేతో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. నాటి కెప్టెన్ సౌరభ్ గంగూలీ గురించి బీసీసీఐకి ఓ ఈమెయిల్ కూడా రాశాడని తెలిపాడు. గంగూలీ అప్పుడు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడని, అలాంటి సమయంలో డ్రసింగ్ రూంలో కూర్చుని మరీ ఈమెయిల్ పెట్టాడని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి