న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెట్టోరి తన మనస్సులోని మాటను వెల్లడించాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో 400 వికెట్లను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు నాలుగు వేల పరుగులను పూర్తి చేయాలన్నదే అంతిమ లక్ష్యమని వెట్టోరి ప్రకటించారు. ఈ అరుదైన రికార్డును హర్యానా హరికేన్, భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ మాత్రమే సాధించారు. ఈ రికార్డును అధికమించాలన్నది తన లక్ష్యంగా వెట్టోరి చెప్పాడు.
ఇందుకోసం మరో నాలుగేళ్ళ పాటు టెస్టు క్రికెట్ ఆడనున్నట్టు తెలిపారు. 31 సంవత్సరాల వెట్టోరి ప్రస్తుతం తన కెరీర్లో వందో టెస్టును ఆడుతున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు వెట్టోరికి వందో టెస్టు కావడం గమనార్హం.
దీనిపై వెట్టోరి మాట్లాడుతూ.. నాకు 35 సంవత్సరాలు వచ్చేంత వరకు టెస్టు క్రికెట్ ఆడాలన్నదే నా కోరిక. ఇందుకోసం తన ఫిట్నెస్ను కాపాడుకుంటానని చెప్పాడు. అయితే, బలవంతంగా క్రికెట్ నుంచి వైదొలగాల్సి వస్తే అది పరిమిత ఓవర్ల క్రికెట్ కావచ్చన్నాడు.