37వ ఏట అడుగెట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్!
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తోన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 37వ ఏట అడుగుపెట్టాడు. క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచిన లిటిల్ మాస్టర్‌కు ఐపీఎల్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో శుక్రవారం అరుదైన పుట్టిన రోజు కానుక అందింది. కాగా.. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ "బెస్ట్ బ్యాట్స్‌మన్" అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి అట్టహాసంగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఉత్తమ కెప్టెన్‌తోపాటు, ఉత్తమ బ్యాట్స్‌మన్ అవార్డు కూడా సచిన్ టెండూల్కర్‌నే వరించడం విశేషం. అలాగే ఐపీఎల్ పోటీలు ఇంకా పూర్తికాకపోవడంతో సచిన్ టెండూల్కర్ తన పుట్టినరోజు వేడుకలకు బ్రేక్ వేసినట్లు తెలిసింది. ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ నెగ్గిన తర్వాత పుట్టిన రోజు వేడుకలను లాంఛనంగా జరుపుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. అద్భుత బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు 14 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడాడు. ఇందులో ఐదు అర్థసెంచరీలు సాధించిన సచిన్, మొత్తం 570 పరుగులు సాధించాడు. దీంతో జాక్వెస్ కల్లీస్ (553), రాబిన్ ఊతప్ప (374), చెన్నై సూపర్ కింగ్స్ సురేశ్ రైనా (463), మురళీ విజయ్ (432)లను వెనక్కి నెట్టి.. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇంకా అంతర్జాతీయ వన్డే, టెస్టు ఫార్మాట్‌లలోనూ సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే.