హామిల్టన్‌లోని సెడెన్ పార్కులో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 279 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు కీపర్ మెక్‌మిల్లన్ (84) టెయిల్ ఎండ్‌ల సాయంతో కొద్ది సేపు ప్రతిఘటించినప్పటికీ భారత బౌలర్ల ముందు తలవంచక తప్పలేదు. దీంతో ఆ జట్టు 102.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ ముంగిట 39 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
అంతకుముందు కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా 279 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. అయితే, భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 520 పరుగులు చేయడంతో 241 పరుగుల ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. ఈ ఆధిక్యమే టీమ్ ఇండియా తొలి టెస్టు విజయానికి కీలకంగా ఉపయోగపడింది.
కాగా, కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ డేనియర్ వెటోరి (118), రైడర్ (102) పరుగులతో రాణించి, జట్టును ఆదుకున్నారు. 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన కివీస్ వీరిద్దరి వీరోచిత ఇన్నింగ్స్ ఫలితంగా కోలుకుంది. ఆ తర్వాత భారత్ ధీటుగా సమాధానం ఇవ్వడంతో కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు.
భారత ఇన్నింగ్స్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 160 పరుగులు చేసి టెస్టుల్లో 42వ సెంచరీని పూర్తి చేశాడు. అలాగే జహీర్ ఖాన్ (51), ధోనీ (47), ద్రావిడ్ (66), లక్ష్మణ్ (30) పరుగులతో రాణించారు.