Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హామిల్టన్ టెస్ట్: రాణించిన భారత్.. స్కోర్ 278/4

Advertiesment
హామిల్టన్ సెడెన్ పార్క్ మైదానం తొలి ఇన్నింగ్స్ బౌలింగ్ అర్థ సెంచరీ ద్రావిడ్ బ్రైన్
హామిల్టన్‌లోని సెడెన్ పార్క్ మైదానంలో ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. సచిన్ (70), యువరాజ్‌సింగ్ (8)లు క్రీజులో ఉన్నారు.

ఓవర్‌నైట్ స్కోరు 29/0తో రెండోరోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ప్రారంభంలోనే గట్టిదెబ్బ తగిలింది. ఊపుమీదున్న సెహ్వాగ్ (24) రనౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో భారత్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అటుపై ఓపెనర్ గంభీర్‌కు జతకలిసిన ద్రావిడ్ అద్భుతంగా ఆడాడు. ద్రావిడ్‌తో కలిసి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న గంభీర్ (72) మార్టిన్ బౌలింగ్‌లో క్రీజు నుంచి నిష్క్రమించాడు. అటుపై అర్థసెంచరీ పూర్తిచేసుకున్న ద్రావిడ్ (66) సైతం బ్రైన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత జత కలిసిన సచిన్, లక్ష్మణ్‌ల జోడీ నెమ్మదిగా ఆడడం ప్రారంభించింది. వీరిద్దరూ కలిసి స్థిరంగా ఆడుతున్న సమయంలో లక్ష్మణ్ (30) మార్టిన్ బౌలింగ్‌లో నాలుగో వికెట్‌గా వెనుతిరిగాడు.

అంతకుముందు తొలిరోజు ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత్ కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పేస్‌కు అనుకూలించే సెడెన్ పార్క్ మైదానంలో భారత్ బౌలర్లు విజృంభించారు. దీంతో కివీస్ ఒకానొక దశలో 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో రైడర్‌, వెట్టోరీలు బ్యాట్‌కు పనిచెప్పడంతో న్యూజిలాండ్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ సెంచరీలు సాధించి జట్టుకు 279 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించారు.

అయితే రైడర్ (102), కెప్టెన్ వెట్టోరీ (118)లు సెంచరీలు సాధించినా మిగిలిన కివీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టడం గమనార్హం. భారత్ తరపున జహీర్‌ఖాన్ సైతం రెండు వికెట్లు సాధించగా, హర్భజన్ ఒక్క వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలిరోజు ఆటముగిసే సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 29 పరుగులు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu