పరాయి దేశాలతో పోల్చినట్లయితే... స్వదేశంలోనే సురక్షితంగా ఉండగలుగుతామని భారత బ్యాటింగ్ ధిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత్‌లో ఉండటాన్ని తాను గర్వంగా భావిస్తున్నాననీ.. విదేశాలకంటే, స్వదేశంలోనే తమకు పూర్తి రక్షణ ఉంటుందన్నాడు.
శ్రీలంక క్రికెట్ జట్టుపై పాక్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై స్పందించిన సచిన్ మాట్లాడుతూ... లంక జట్టుకు తన సానుభూతిని తెలియజేశాడు. లంక క్రికెటర్లలో చాలామందితో తనకు స్నేహం ఉందనీ, దాడిలో గాయపడ్డ వారందరూ త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్‌లో ఉండే భద్రతా ఏర్పాట్లు తమను సురక్షితంగా ఉంచుతాయనీ, ఇతర దేశాలలో తాము స్వేచ్ఛగా తిరగలేమని సచిన్ ఈ సందర్భంగా చెప్పాడు.
లంక ఆటగాళ్లపై జరిగిన ఉగ్రవాదుల దాడి తనను కలచివేసిందనీ, ఆ షాక్ నుంచి తేరుకునేందుకు చాలా సమయం పట్టిందని మాస్టర్ వ్యాఖ్యానించాడు. ఉగ్రవాదుల దాడి పాక్ క్రికెట్‌పై తీవ్రంగా ప్రభావం చూపించడం ఖాయమనీ... ఇంత జరిగాక ఏ దేశ క్రికెట్ జట్టయినా అక్కడ ఆడేందుకు ఇష్టపడదనీ ఆయన పేర్కొన్నాడు.