డెక్కన్ ఛార్జర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ రెచ్చగొట్టాడని అందువల్ల తాను మైదానంలో రెచ్చిపోయినట్టు రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ అన్నాడు. ఐపీఎల్ పోటీల్లో భాగంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ అదరగొట్టే ఇన్నింగ్స్ ఆడటంతో షేన్ వార్న్ జట్టు సునాయాస విజయం సాధించిన విషయం తెల్సిందే.
ఈ మ్యాచ్ అనంతరం యూసుఫ్ మీడియాతో మాట్లాడుతూ తాను క్రీజ్‌లోకి అడుగుపెట్టగానే సైమండ్స్ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. దీన్ని ఒక సవాల్‌గా స్వీకరించి, తనలోని ఉద్వేగాన్ని మైదానంలో చూపిస్తూ.. డెక్కన్ బౌలర్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడినట్టు చెప్పాడు.
ఫలితంగా తన జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో విజయపథంలో నడిపించినట్టు పఠాన్ గర్వంగా చెప్పాడు. 34 బంతులు ఎదుర్కొన్న యూసుఫ్ పఠాన్ రెండు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 73 పరుగులు చేసిన విషయం తెల్సిందే.
కాగా, ఆస్ట్రేలియా జట్టులో అత్యంత చెత్త ఆటగాడిగా పేరొందిన సైమండ్స్.. ఐపీఎల్లో స్లెడ్జింగ్‌కు పాల్పడటం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇతర జట్లతో ఆడేసమయంలో ఆసీస్ జట్టు స్లెడ్జింగ్‌కు పాల్పడుతుంది. ఇదే అలవాటును ఆ జట్టుకు చెందిన ఆటగాడు ఈ తరహా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.