సీఏ కాంట్రాక్టుల జాబితా: బ్రాకెన్, క్లార్క్, హస్సీలు అవుట్!
క్రికెట్ ఆస్ట్రేలియా 2010-2011 కాంట్రాక్ట్ జాబితాలో ఫాస్ట్ బౌలర్లు నాథన్ బ్రాకెన్, స్టువర్ట్ క్లార్క్, బ్యాట్స్మెన్ బ్రాడ్ హడ్జ్, డేవిడ్ హస్సీల పేర్లు కనుమరుగయ్యాయి. క్రికెట్ ఆస్ట్రేలియా నూతన కాంట్రాక్టు జాబితా వివరాలను బుధవారం ప్రకటించింది. ఇందులో బ్రాకెన్, స్టువర్క్ క్లార్క్, హడ్జ్ హస్సీలతో పాటు వికెట్ కీపర్ గ్రహమ్ మాన్యూ పేరును కూడా తొలగించారు. 25
మంది క్రీడాకారులతో కూడిన ఈ కాంట్రాక్టు జాబితాలో పై ఐదుగురు ఆటగాళ్ల పేర్లను తొలగించినట్లు సీఏ తెలిపింది. వీరికి బదులు పేస్ బౌలర్లు రియాన్ హారిస్, క్లింట్ మెక్కే, వికెట్-కీపర్ బ్యాట్స్మెన్ టిమ్ పైనీ, ఆల్-రౌండర్ స్టీవెన్ స్మిత్, ఆడమ్ వోగ్స్ల పేర్లను జాబితాలో చేర్చినట్లు సీఏ ప్రకటించింది. ఇకపోతే... స్టార్ ఆటగాడు బ్రెట్ లీ గాయాల నుంచి మెల్లమెల్లగా కోలుకుని ఐపీఎల్లో ఆడుతున్న కారణంగా అతని పేరును కూడా సీఏ జాబితాలో చేర్చింది. ఇతనితో పాటు షాన్ టైట్ కూడా సీఏ కాంట్రాక్టు లిస్టులో స్థానం సంపాదించుకున్నాడు. కాగా.. సీఏ కాంట్రాక్టు జాబితా నుంచి తమ పేర్లను తొలగించడంపై స్టువర్ట్ క్లార్క్, నాథన్ బ్రాకెన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టువర్ట్, నాథన్లకు మంచి రికార్డులున్నప్పటికీ వారి పేర్లను జాబితాలో చేర్చకపోవడం సరైన నిర్ణయం కాదని భావిస్తున్నారు.