సీఎస్‌కేలో ఫ్లింటాఫ్ లేకపోవడమే ఓటమికి కారణం: ధోనీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస పరాజయాలకు ఇంగ్లండ్ ఆల్ రౌండర్, స్టార్ బౌలర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ లేకపోవడమే ప్రధాన కారణమని ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వివరణ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఐపీఎల్-3లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్రమే నెగ్గింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూసింది.దీనికి బౌలర్లు క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవడం మరియు ఫ్లింటాఫ్ లాంటి స్టార్ బౌలర్ సీఎస్‌కే తరపున ఆడలేకపోవడమేనని ధోనీ వెల్లడించాడు. సచిన్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్‌తో గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్ 21వ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదువికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. "తొలుత 180 పరుగులు సాధిస్తే విజయం సాధించడం ఖాయమని భావించాం. కానీ బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఓటమిని రుచి చూశాం. ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్.. రెండు విభాగాల్లోనూ రాణించే ఆండ్రూ ఫ్లింటాప్ ఈ సీజన్‌లో ఆడకపోవడమే జట్టు పరాజయాల పాలవుతుందని ధోనీ వాపోయాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ లేకపోవడం జట్టుకు కొరతేనని ధోనీ స్పష్టం చేశాడు. ప్రాక్టీస్‌లో అద్భుతంగా రాణించిన బౌలర్లు, మైదానంలో జట్టు కష్టాల్లో ఉన్నప్పటికీ ధీటుగా రాణించలేకపోయారని కెప్టెన్ చెప్పాడు. ఇదిలా ఉంటే.. గాయం కారణంగా ఐపీఎల్ మూడో సీజన్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్ పాల్గొనలేకపోయాడు.