లాహోర్ దాడిలో గాయపడిన శ్రీలంక క్రికెటర్లు... సాధ్యమైనంత తొందరగా భయానక అనుభవాలను మర్చిపోయి మానసికంగా, శారీరకంగా కోలుకునేందుకు వీలుగా, కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు.. ఆ దేశ క్రీడల శాఖ వైద్య విభాగం డైరెక్టర్ జనరల్ గీతాంజన మెండిస్ పేర్కొన్నారు.
ఈ విషయమై గీతాంజన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... క్రికెటర్లు తిరిగీ గాడిలో పడేందుకు, అన్ని రకాలుగా సంసిద్ధులయ్యేందుకు ఈ కౌన్సెలింగ్ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఒక నెల లోపు క్రికెటర్లు మళ్లీ మైదానంలో అడుగు పెట్టేలాగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం గాయపడిన ఆటగాళ్లతో వారి బంధువులు తోడుగా ఉన్నారనీ... వారి సాన్నిహిత్యం క్రికెటర్లకు సౌకర్యాన్ని, హాయిని ఇస్తుందని గీతాంజన మెండిస్ అన్నారు. సొంతవారు తోడుగా ఉండటం వల్ల.. వారు మరింత తొందరగా కోలుకోగలరని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.