వెల్లింగ్టన్‌లో శుక్రవారం నుంచి ఆతిథ్య జట్టు న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మూడో, ఆఖరు టెస్టులో 'టీం ఇండియా' కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడే విషయంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. మూడో టెస్టుకు ధోనీ అందుబాటులో ఉండే విషయాన్ని మ్యాచ్‌కు ముందు మాత్రమే చెబుతామంటూ 'టీం ఇండియా' ప్రకటించింది. ఈ విషయమై ధోనీ మాట్లాడుతూ తన వీపు నొప్పి నయమైందని అయితే మ్యాచ్ సమయానికి ఎలా ఉంటుందన్న విషయాన్ని తాము వేచి చూస్తున్నామని పేర్కొన్నాడు.
తాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 50 ఓవర్ల మ్యాచ్‌కు పూర్తి అనుకూలంగా ఉన్నానని అయితే టెస్టుల్లో రోజంతా క్రీజులు ఉండాల్సి వస్తుంది కాబట్టి మ్యాచ్ ప్రారంభం వరకు వేచి చూడనున్నట్టు ధోనీ పేర్కొన్నాడు. అదేసమయంలో తాను మ్యాచ్‌కు అందుబాటులో లేనంత మాత్రాన టీం బలహీనం అవుతుందని అనుకోవడం లేదని ధోనీ వ్యాఖ్యానించాడు.
తాను ఆడినా ఆడకున్నా జట్టుపై ప్రభావం పడపబోదని అన్నాడు. అదేసమయంలో కోచ్ కిర్‌స్టన్ మాట్లాడుతూ మ్యాచ్ సమయానికి ధోనీ ఫిట్‌నెస్ సాధిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతానికి మ్యాచ్‌లో ధోనీ ఆడుతాడా లేదా అన్న అంశంపై నిర్ణయం తీసుకోలేదని కిర్‌స్టన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ధోనీపై కిర్‌స్టన్ ప్రశంసల వర్షం కురిపించాడు.