నేపియర్‌లో టీం ఇండియా కివీస్‌పై ప్రదర్శించిన ఆటతీరును బట్టి, ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్‌పై విమర్శలు గుప్పించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ క్రో లెంపలేసుకున్నాడు. వీరూది చెత్త కెప్టెన్సీ అని, ఫీల్డింగ్ ఎలా సర్దుకోవాలో కూడా అతనికి తెలియదని వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మార్టిన క్షమాపణలు చెప్పాడు.
ప్రస్తుత సిరీస్‌కు టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మార్టిన్ ఈ విషయమై మాట్లాడుతూ.. వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్సీ విధానంపై తొందరపడి నోరు జారానని అంగీకరించాడు. తక్కువ సమయంలోనే కెప్టెన్సీపై ఒక అభిప్రాయానికి రావడం తప్పేనని, ఈ విషయంలో తాను కాస్త సహనం వహించి ఉంటే చాలా బాగుండేదని క్రో వెల్లడించాడు.
వీరేంద్ర సింగ్ కెప్టెన్సీ తీరు టాస్ గెలిచేందుకు ముందే తెలిసిందని క్రో అన్నాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే టీం ఇండియా, ఆతిథ్య జట్టుపై 2-0 తేడాతో నెగ్గి స్వదేశానికి చేరుకునే అవకాశాలు కన్పిస్తున్నాయని క్రో అభిప్రాయపడ్డాడు.
ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్‌తో నేపియర్‌లో జరిగిన రెండో టెస్టులో టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గాయంతో ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో సెహ్వాగ్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.