విదేశాల్లో ఐపీఎల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లపై లలిత్ మోడీ దృష్టి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చే దిశగా ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ అన్వేషిస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ ద్వారా భారీ ఆదాయం లభిస్తుండగా, తాజాగా విదేశాల్లోనూ కొన్ని ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు నిర్వహించడం ద్వారా ఖజానాను నింపవచ్చునని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది భారత్‌లోనే జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను, సమయానుకూలంగా 4 లేదా ఐదు మ్యాచ్‌లను విదేశాల్లో జరిపేలా లలిత్ మోడీ రంగం సిద్ధం చేస్తున్నారు. 2011
నుంచి విదేశాల్లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని మోడీ స్పష్టం చేశారు. ప్రతి ఏడాది ఐపీఎల్ భారత్‌లోనే జరుగుతుంది. జూన్ నుంచి జనవరి వరకు వారాంతాల్లో ఖాళీగా ఉండే జట్లు విదేశాల్లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడుతాయని మోడీ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. ఇప్పటికే ధన క్రీడగా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. నిజంగానే కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-3 ద్వారా బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో ఐపీఎల్ ఒక బిలియన్ మేర ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని ఇటీవల ప్రకటన చేశారు. ఈ టోర్నీ మొత్తం పూర్తయ్యే సరికి ఖచ్చితంగా ఒక బిలియన్ డాలర్ల (సుమారు 4,700 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని మోడీ వెల్లడించిన సంగతి తెలిసిందే.