విజృంభించిన మిట్చెల్ జాన్సన్: ఆస్ట్రేలియా ఘనవిజయం
న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్ జాన్సన్ విజృంభించి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ 176 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2/0 తేడాతో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది. 185
/5 స్కోరుతో బుధవారం ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు లంచ్ విరామానికి ముందు 302 పరుగులకే అన్ని వికెట్లను కోల్పోయింది. మిట్చెల్ జాన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేసి.. 78 పరుగులకు ఆరు వికెట్లు సాధించాడు. ఇక.. న్యూజిలాండ్ ఆటగాళ్లలో బ్రాండన్ మెక్కల్లమ్ (51) 98 బంతుల్లో 9 బౌండరీలు, ఒక సిక్సర్ సహాయంతో అర్థసెంచరీని నమోదు చేసుకుని బొలింగర్ బంతికి పెవిలియన్ ముఖం పట్టాడు. ఇదేవిధంగా జేఎస్ పటేల్ కూడా కేవలం మూడు పరుగులకే బొలింగర్ బౌలింగ్‌కు వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి దిగి నిలకడగా ఆడిన గుప్తిల్ 58 పరుగుల వద్ద జాన్సన్ బంతికి తలొగ్గాడు.చివరిలో టిమ్ సౌదీ ఏడు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు సాధించి, జాన్సన్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. ఫలితంగా 91.1 ఓవర్లలో న్యూజిలాండ్ 302 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 176 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఇకపోతే.. విజృంభించి ఆడిన మిట్చెల్ జాన్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.