రెండు మ్యాచ్‌ల ట్వంటీ20 అంతర్జాతీయ టోర్నీలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న నేపథ్యంలో... ఓడిపోయామని బాధపడుతూ కూర్చోవద్దనీ... ముందున్న ఐదు వన్డేల సిరీస్‌కు సన్నద్ధం కావాలని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన సహచరులకు పిలుపునిచ్చాడు.
మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ... ట్వంటీ20 మ్యాచ్‌లు కివీస్‌లోని పిచ్‌లు, ఇక్కడి పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్ల బలాబలాలపై తమకు మంచి అవగాహనను కల్పించాయన్నాడు. రెండు మ్యాచ్‌లు ఓడిపోయామని విచారిస్తూ కూర్చోవడంలో ఎలాంటి అర్థమూ లేదనీ... వన్డే సిరీస్‌పై తమ దృష్టి నిలిపామని అన్నాడు.
టీం ఇండియా సన్నాహకాలపై సంతోషంగానే ఉన్నాననీ... ట్వంటీ20లో తమ ప్రదర్శన బాగుందనీ ధోనీ వ్యాఖ్యానించాడు. చాలామంది తమ కుర్రాళ్లు క్రీజులో తగినంత సమయం గడిపారనీ... ఇక్కడి పిచ్‌లు ఎలా స్పందిస్తున్నాయన్నది వారికి బాగా అర్థమైందని, ఇది వన్డే సిరీస్‌లో ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పాడు. కివీస్ కంటే మెరుగైన బ్యాటింగ్ లైనప్ టీం ఇండియాకు ఉందని ధోనీ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే... గాయపడ్డ పేసర్ ఇషాంత్ శర్మ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా, లేదా అన్న విషయమై ఇప్పుడేమీ చెప్పలేమని ధోనీ వెల్లడించాడు. గాయం తీవ్రతను ఇంకా నిర్ధారించాల్సి ఉందనీ, వైద్య పరీక్షల అనంతరం ఓ నిర్ణయానికి వస్తామని చెప్పాడు. కాగా, శుక్రవారం రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో బంతిని ఆపేందుకు డైవ్ చేసినప్పడు ఇషాంత్ కుడి భుజానికి గాయమైన సంగతి తెలిసిందే...!