న్యూజిలాండ్ పిచ్‌లపై వన్డే మ్యాచ్‌లలో డబుల్ సెంచరీ చేయడం సాధ్యమేననీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కివీస్ గ్రౌండ్‌లు చాలా చిన్నవిగా ఉంటాయనీ, ఏ బ్యాట్స్‌మెన్ అయినా 50 ఓవర్లపాటు క్రీజులో నిలిస్తే 200 పరుగులు చేయడం సాధ్యమేనని అన్నాడు.
నాలుగో వన్డే విజయానంతరం వీరూ మాట్లాడుతూ... తనను విధ్వంసర బ్యాట్స్‌మెన్‌గా అభివర్ణించడాన్ని అంగీకరించనని చెప్పాడు. ఎందుకంటే... కోచ్, కెప్టెన్ తనకు ఎంతగానో స్వేచ్ఛనిచ్చారనీ, అందుకే తాను స్వేచ్ఛగా ఆడగలుగుతున్నానని వ్యాఖ్యానించాడు. కివీస్ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, తన దూకుడు ఆపడం కివీస్ బౌలర్లకు కష్టమేనని వీరూ అన్నాడు.
బౌలర్లు తన శరీరంపైకి బంతులు విసురుతున్నా పట్టించుకోకుండా, తాను హుక్, ఫ్లిక్ షాట్లతో వాటిని బౌండరీలుగా మలచానని సెహ్వాగ్ వివరించాడు. బంతి ఎలా వస్తోందో తాను ఆలోచించలేదనీ, బాదటమే పనిగా పెట్టుకున్నాననీ... హామిల్టన్ సెంచరీ తన బెస్ట్ ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. యువకులతో కూడిన టీం ఇండియా పటిష్టంగా ఉందనీ... అనూహ్యమైన విజయాలను సొంతం చేసుకోవటమే పనిగా పెట్టుకుందని సెహ్వాగ్ తెలిపాడు. కాబట్టి... ఎంతటి లక్ష్యాన్నైనా లెక్కచేయకుండా, 60 బంతుల్లో 100 పరుగులు చేయగల తనలాంటి బ్యాట్స్‌మెన్‌లు జట్టులో ఇంకా ఉన్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశాడు.