Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లలిత్ మోడీపై బీసీసీఐ కన్నెర్ర: ఛైర్మన్ పదవికి ఎసరు..!?

Advertiesment
లలిత్ మోడీ
PTI
కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారం లలిత్ మోడీ ఐపీఎల్ ఛైర్మన్ పదవికి ఎసరు పెట్టేలా ఉంది. కొచ్చి ఫ్రాంఛైజీ వ్యవహారంలో మోడీ ఓవరాక్షన్ ప్రదర్శించడంపై బీసీసీఐ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. వ్యవహారాన్ని చక్కదిద్దడంపోయి ఐపీఎల్ పరువును బజారుకీడ్చడటంపై మండి పడుతోంది.

సౌత్ ఆఫ్రికా మోడల్‌ డెమట్రియాడెస్‌కు కొచ్చి ఫ్రాంచైజీని అందజేయాలనే ఉద్దేశంతోనే, ఆ జట్టుకు సంబంధించిన యజమానుల వివరాలను అనధికారంగా మోడీ ట్విట్టర్‌లో పొందుపరిచారని ఆరోపణలు వినవస్తున్న నేపధ్యంలో బీసీసీఐ ఆగ్రహం కట్టలు తెంచుకున్నది.

కేంద్ర మంత్రి శశిథరూర్ మూడోసారి వివాహం చేసుకోనున్న సునందకు కొచ్చి ఫ్రాంచైజీ దక్కడంతో లలిత్ మోడీ మొహం చిన్నదైందని.. ఆ జట్టు సహ యజమానులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అలాగే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రమేయం, ఒత్తిడితో కొచ్చి ఫ్రాంచైజీ జట్టు నుంచి తప్పుకోవాల్సిందిగా ఆ జట్టు యజమానులకు లలిత్ మోడీ హెచ్చరించినట్లు కూడా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇంకా కొచ్చి ఫ్రాంచైజీ నుంచి తప్పుకుంటే 250 కోట్ల రూపాయలను ఇస్తానని లలిత్ మోడీ ఆఫర్ చేసినట్లు సమాచారం.

కొచ్చి ఫ్రాంచైజీని సునందకు ఇవ్వడం ఇష్టం లేకపోవడంతోనే లలిత్ మోడీ ఆ వ్యవహారాన్ని రాద్దాంతం చేస్తున్నారని తెలిసింది. అందుకే ఈ వ్యవహారంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఫ్రాంచైజీ వివరాలను బయటపెట్టడంతో మోడీ ప్రచారాన్ని మొదలెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంకా ఐపీఎల్‌లో భారీ అవకతవకలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో ఐపీఎల్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. దీంతో ఐపీఎల్ లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐటీ శాఖాధికారులు తనిఖీలు చేశారు. ఇంకా లలిత్ మోడీ వద్ద ఈ వివరాలపై 8 గంటల పాటు విచారణ జరిపారు.

ఈ నేపథ్యంలో కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారం, ఐటీ దాడుల్లో చిక్కుకున్న లలిత్ మోడీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కన్నెర్ర చేసింది. 2012 వరకు లలిత్ మోడీని ఛైర్మన్ పదవి నుంచి తప్పించే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతానికి మోడీ అధికారాలకు కత్తెర విధంచడం ద్వారా బలహీనుణ్ణి చేయాలను యోచిస్తోంది.

ఇందులో భాగంగా.. తాజా వివాదాలను సాకుగా చూపించి మోడీ అధికారాలను కో-ఛైర్మన్‌గా శశాంక్ మనోహర్‌కు అప్పగించాలని భావిస్తోంది. మొత్తమ్మీద బీసీసీఐ త్వరలో ఇవ్వబోయే షాక్‌తో లలిత్ మోడీ తెప్పరిల్లుకోవడం కష్టమేనంటున్నారు క్రీడా విశ్లేషకులు.

Share this Story:

Follow Webdunia telugu