లలిత్ మోడీని రెండోసారి ప్రశ్నించిన ఐటీ అధికారులు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఛైర్మన్ లలిత్ మోడీ ఆర్థికమైన అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఆదాయ పన్ను శాఖ సోదాలను వేగిరం చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసిన మీడియా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన ఐటీ శాఖ, గురువారం దేశవ్యాప్తంగా ఐపీఎల్ కార్యాలయాలపై దాడికి దిగింది. ఇంకా బుధవారం ఐపీఎల్ చీఫ్ లలిత్ మోడీపై ఐటీ శాఖాధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఐపీఎల్ లావాదేవీలపై సమగ్ర విచారణ కోసం మోడీని ప్రశ్నించారు. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, డెక్కన్ ఛార్జర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వంటి ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్ల కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.కాగా డబ్బులు పంట పండే ఐపీఎల్‌లో లలిత్ మోడీ భారీ అవకతవకలకు పాల్పడ్డారని గతవారంలో ఆరోపణలు వెలువెత్తిన సంగతి తెలిసిందే. కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంతో లలిత్ మోడీ గుట్టురట్టైన నేపథ్యంలో.. ఇదే వారంలో ఐటీశాఖాధికారులు మోడీ వద్ద విచారణ జరపడం రెండో సారి కావడం గమనార్హం. ముంబైలోని మోడీ కార్యాలయంలో ఆరు మంది సభ్యులతో కూడిన ఐటీ బృందం మోడీని ప్రశ్నించింది.