రేపే టీం ఇండియా-కివీస్ రెండో వన్డే పోరాటం
సిరీస్ కైవసం కోసం భారత్ ఆరాటం
టీం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌లో భాగంగా... శుక్రవారం రెండో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ట్వంటీ20 సిరీస్‌లో ఓటమి చవిచూసిన టీం ఇండియా రెట్టించిన కసితో రెండో వన్డేలో కూడా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా, మొదటి వన్డే మ్యాచ్‌లో టీం ఇండియా ఘన విజయం సాధించిన సంగతి విదితమే.
టీం ఇండియా ఓపెనర్లుగా ఎప్పట్లాగే వీరేంద్ర సెహ్వాగ్, సచిన్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. అయితే తొలి వన్డేలో రాణించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనాలు ఏ బ్యాటింగ్ ఆర్డర్‌లో వస్తారన్నది ఇంకా తెలియరాలేదు. ఇక యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్‌ల స్థానాల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. బౌలింగ్ విషయానికి వస్తే.. గాయం కారణంగా తొలివన్డేకి దూరమైన ఇషాంత్ తిరిగీ జట్టులోకి రానుండగా, మునాఫ్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
ఇక కివీస్ జట్టు విషయానికి వస్తే... ట్వంటీ20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకున్నప్పటికీ, సిరీస్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లోనే బొక్కబోర్లా పడటంతో, రెండో వన్డేలో ఎలాగైనా సరే నెగ్గాలన్న పట్టుదలతో బరిలో దిగనుంది. ఇదిలా ఉంటే... బొటనవ్రేళ్ల గాయం కారణంగా... ఈ జట్టు డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇందులో ఆడేది అనుమానాస్పదంగానే ఉంది.
అందుకే ముందు జాగ్రత్త చర్యగా మెక్‌గ్లాసన్‌ను కివీస్ జట్టులోకి తీసుకున్నారు. ఇక, ఒబ్రియాన్ స్థానంలో సౌథీ తుది జట్టులో స్థానం సంపాదించుకునే అవకాశాలున్నాయి. ఇవి మినహాయిస్తే.. కివీస్ జట్టులో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. కాగా, ఈ రెండో వన్డే సెట్‌మాక్స్, దూరదర్శన్ ఛానెల్స్‌లో శుక్రవారం ఉదయం 6.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.
జట్ల వివరాలు :
టీం ఇండియా : మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్, హర్భజన్ సింగ్, జహీర్‌ఖాన్, ఇషాంత్‌శర్మ.
న్యూజిలాండ్ : వెటోరి (కెప్టెన్), నీల్‌బ్రూమ్, రైడర్, రాస్ టేలర్, ఇయాన్ బట్లర్, గుప్తిల్, ఓరమ్, మీల్స్, ఇలియట్, ఒబ్రియాన్ లేదా సౌథీ, మెక్‌కల్లమ్ లేదా మెక్‌గ్లాసన్.