Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెచ్చిపోయిన ఆఫ్రిది: పాక్ చేతిలో కివీస్ చిత్తు

Advertiesment
పాకిస్థాన్
, బుధవారం, 4 నవంబరు 2009 (09:31 IST)
పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఫలితంగా తటస్థ వేదిక అబుదాబీలో మంగళవారం జరిగిన తొలి డే అండ్ నైట్ మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్ జట్టును పాకిస్థాన్ చిత్తు చేసింది. స్కోరు బోర్డుపై పరుగుల ఖాతా తెరవకుండానే రెండు ప్రధాన వికెట్లను కోల్పోయిన పాక్‌ను ఓపెనర్ ఖలీద్ లతీఫ్, బిగ్ హిట్టర్, షాహిద్ ఆఫ్రిది, వికెట్ కీపర్ కమ్రాన్ అక్మాల్‌లు ఆదుకున్నారు.

ఫలితంగా ఆ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఫ్రది చెలరేగి యాభై బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో 75 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయిన పాకిస్థాన్‌ జట్టును ఖలీద్‌, ఆఫ్రిదీల జోడీ ఆదుకుంది. ఈ జోడీ ఐదో వికెట్‌కు 101 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.

ఇందులో ఆఫ్రిదీ వాటా 70 పరుగులు. లతీఫ్‌ నిదానంగా ఆడి ఆఫ్రిదీకి ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ అక్మాలు బ్యాట్‌కు పని చెప్పి 43 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. ఫలితంగా ఆ జట్టు 287 పరుగులు చేసింది. కివీస్ జట్టులో వెట్టోరి, బాండ్‌లు రెండేసి వికెట్లు తీశారు.

ఆ తర్వాత 288 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు బ్యాటింగ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆ జట్టు ఓపెనర్లు మెక్‌కల్లమ్ (22), రెడ్‌మాండ్ (52), వెట్టోరి (38) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ రెండంకెల స్కోరు చేయలేక పోయారు. ఫలితంగా 39.2 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది.

పాక్ బౌలర్లు ఉమర్ గుల్, అబ్దుల్ రజాక్, ఆఫ్రిది, అజ్మల్‌లు సమిష్టిగా రాణించి రెండేసి వికెట్లు తీయగా, మహ్మద్ అమీర్ ఒక విటెక్ తీసి కివీస్ ఇన్నింగ్స్‌కు చరమగీతం పాడారు. ఫలితంగా 138 పరుగుల భారీ తేడాతో పాక్ విజయభేరీ మోగించింది. "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు ఆల్‌రౌండ్ ప్రదర్శన కనపరిచిన షాహిద్ ఆఫ్రిదికి దక్కింది. ఈ విజయంతో పాకిస్థాన్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.

Share this Story:

Follow Webdunia telugu