ఐసీసీ వార్షిక టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా రెండో స్థానాన్ని తృటిలో చేజార్చుకుంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా రెండో స్థానంవైపు దూసుకెళ్లిన టీం ఇండియాకు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. ఆస్ట్రేలియాపై మూడో టెస్ట్‌లో నెగ్గడం ద్వారా దక్షిణాఫ్రికా నెంబర్.2 స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది.
దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో పరాజయం పాలై ఉంటే టీం ఇండియా రెండో స్థానానికి చేరుకునేది. ఐసీసీ ఏప్రిల్ 1లోగా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న జట్టుకు రూ.88 లక్షలు, రెండో స్థానంలో ఉన్న జట్టుకు రూ.37 లక్షల బహుమతి అందించనుంది. అయితే రెండో స్థానాన్ని తృటిలో కోల్పోయిన టీం ఇండియాకు ఈ బహుమతి కూడా దూరమైంది.
తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా 125 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 119 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలోనూ, దానికి ఒక పాయింట్ తక్కువతో భారత్ మూడో స్థానంలో నిలిచాయి. ఇదిలా ఉంటే వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా ఐసీసీ బహుమతులు అందుతాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా (125), ఆస్ట్రేలియా (124), టీం ఇండియా (118) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.