రిటైర్మెంట్ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ప్రస్తుతం పరుగుల మోతలో టీం ఇండియాను ఆదుకుంటోన్న సచిన్, అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పే అంశంపై ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించాడు.
ఇప్పటికే వన్డే, టెస్టుల్లో భారత్ తరపున ఆడి 29వేల పరుగులు సాధించిన సచిన్, ఇందులో.. 85 శతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్‌లో రాణిస్తూ, అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రిటైర్‌మెంట్ గురించి ఆలోచిస్తేనే బాధేస్తుందని సచిన్ అన్నాడు.
ఇంకా దేశం తరపున మైదానంలో గట్టిపోటీని ప్రదర్శించాలనుందని సచిన్ చెప్పాడు. తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో అనుభూతులను చవిచూశానని, ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో ధీటుగా రాణించడం ఆనందంగా ఉందని మాస్టర్ బ్లాస్టర్ తెలిపాడు.
ఇదే ఆటతీరును కొనసాగించాలనుందని, క్రికెట్ అంటే తనకెంతో ఇష్టమని, రానున్న మ్యాచ్‌లలోనూ తనదైన శైలిలో రాణిస్తానని సచిన్ చెప్పాడు. మైదానంలో బ్యాట్‌తో బరిలోకి దిగే సమయంలో తనలో ఉద్వేగం పెరుగుతోందని, తనలో ఆ ఉద్వేగం కరువైనట్లు అనిపిస్తే వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెబుతానని సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు.