వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్ యూనిస్ ఖానే తిరిగి జట్టుకు నాయకత్వం వహించవచ్చునని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఇజాజ్ భట్ తెలిపారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఎలాంటి విభేదాలు లేవని భట్ స్పష్టం చేశారు.
ఒకవైపు పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ జట్టులో విభేదాలున్నాయని తెలిపిన నేపథ్యంలో.. ఇజాజ్ భట్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జట్టు వైఫల్యం చెందినప్పుడల్లా ఇలాంటి ఊహాగానాలు, వదంతులు రావడం మామూలేనని కొట్టిపారేశారు.
కొంతమంది సీనియర్ ఆటగాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, అందుకే న్యూజిలాండ్ టూర్ నుంచి విశ్రాంతి కోరానని యూనిస్ ఖాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ విషయమై ఇజాజ్ భట్ మాట్లాడుతూ.. యూనిస్ ఖాన్ విశ్రాంతి కోరాడు, తీసుకున్నాడే తప్ప జట్టులో విభేదాలు లేవని ఇజాజ్ భట్ స్పష్టం చేశారు. తాను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోని రావాలని ఆశిస్తున్నట్లు యూనిస్ మీడియాతో చెప్పాడని న్యూజిలాండ్ టూర్ అయిపోతే మళ్లీ అతనే కెప్టెన్‌గా రావచ్చునని ఇజాజ్ భట్ అన్నారు.