మోడీ.. రహస్యాలను కాపాడలేకపోయారు..!: మనోహర్
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం చెల్లదంటూ.. లలిత్ మోడీ వ్యాఖ్యానించినప్పటికీ ముందుగా నిర్ణయించినట్లే ఐపీఎల్ గవర్నింగ్ భేటీ ఈ నెల 26వ తేదీన జరిగితీరుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్పష్టం చేశారు. ఐపీఎల్ ఆర్థిక అవకతవకలపై ఈ నెల 26వ తేదీన జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారపూర్వకంగా చెల్లదని, ఈ సమావేశంలో తాను హాజరుకానని లలిత్ మోడీ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ఛైర్మన్‌గా కీలక బాధ్యతలను చేపట్టిన లలిత్ మోడీ ఫ్రాంచైజీ యజమానుల వివరాలను ట్విట్టర్‌లో తెలియజేయడం నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుందని శశాంక్ మనోహర్ అన్నారు. కొచ్చి ఫ్రాంచైజీ వివరాలను ట్విట్టర్‌లో పెట్టడం ద్వారా ఐపీఎల్ రహస్యాలను మోడీ కాపాడలేకపోయారని బీసీసీఐ అధ్యక్షుడు చెప్పారు. ఇంకా ఐపీఎల్ ఛైర్మన్ అయిన తన ప్రమేయం లేకుండా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు కావడం అనధికారమని మోడీ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయమై శశాంక్ మనోహర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరవడం, కాకపోవడం ఆయన ఇష్టమని చెప్పారు. సొంత అభిప్రాయాలను కలిగివుండే హక్కు మోడీకి కూడా ఉందని శశాంక్ మనోహర్ అన్నారు. అలాగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని ఐపీఎల్ ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ ఆధ్వర్యంలో జరిపే అధికారం లేదని మోడీ వ్యాఖ్యలపై శశాంక్ మనోహర్ మండిపడ్డారు. ఐపీఎల్ వేలంలో ఎన్. శ్రీనివాసన్ ఒక జట్టును కొనుగోలు చేశారనే మోడీ వ్యాఖ్యలను శశాంక్ మనోహర్ ఈ సందర్భంగా తోసిపుచ్చారు. ఇంకా శ్రీనివాసన్ ఐపీఎల్ జట్టును కొనలేదని, ఆయన ఐపీఎల్ జట్టుకు యజమాని కాదని స్పష్టం చేశారు. శ్రీనివాసన్ ఐపీఎల్ వేలం పాటలో కొన్నారనే ఆ జట్టు ఇండియా సిమెంట్‌కు సొంతమైందనే విషయాన్ని మోడీ గుర్తుపెట్టుకోవాలని శశాంక్ మనోహర్ సూచించారు. ఇండియా సిమెంట్‌కు చెందిన ఐపీఎల్ జట్టుకు, శ్రీనివాసన్‌కు ఎలాంటి సంబంధం లేదని మనోహర్ వెల్లడించారు. ఇంకా ఐపీఎల్ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న శ్రీనివాసన్ ఎలాంటి సమావేశాన్నైనా తన ఆధ్వర్యంలో నిర్వహించే అధికారం ఉందని మనోహర్ స్పష్టం చేశారు.ఇకపోతే.. బీసీసీఐ లలిత్ మోడీకి ఉద్వాసన పలికేందుకు సంసిద్ధమవుతోంది. కొచ్చి ఫ్రాంచైజీ వివరాలను ట్విట్టర్‌లో పెట్టడం ద్వారా లలిత్ మోడీ నిబంధనలను అతిక్రమించారని పేర్కొంటూ.. ఛైర్మన్ పదని నుంచి మోడీని తొలగించేందుకు సంసిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 26వ తేదీన జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఇదే అంశాన్ని ఎత్తిచూపి, మోడీ పదవికి ఎసరుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.