సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ప్రతీకారం తీర్చుకుంది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ఇన్నింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. సఫారీ బౌలర్ పాల్ హారీస్ చెలరేగి ఆరు వికెట్లు తీయడంతో ఆసీస్ జట్టు ఇన్నింగ్స్ ఓటమి కోరల నుంచి బయటపడలేక పోయింది.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 442 పరుగులు వెనుకబడిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మరో రోజు ఆట మిగిలివుండగానే సఫారీలు విజయాన్ని అందుకున్నారు. ఆసీస్ జట్టు బ్యాట్స్‌మెన్ మిచెల్ జాన్సన్ అజేయ సెంచరీ (103 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 పరుగులు) చేసినప్పటికీ జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించలేక పోయాడు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో హారీస్ ఆరు వికెట్లు తీయగా, స్టెయిల్ మూడు పడగొట్టాడు. దీంతో "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డును హారీస్ అందుకున్నాడు. అంతకుముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులు చేసింది. అలాగే దక్షిణాఫ్రికా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 651 పరుగుల భారీ స్కోరు చేసి, విజయానికి బాటలు వేసుకుంది.