ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో మాంచి జోరుమీద ఉన్న భారత జట్టు, మంగళవారం జరుగనున్న రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. కాగా, తొలి మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్టుపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే.
మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై మహిళా క్రికెటర్లు అద్భుతంగా రాణించి విజయం సాధించారు. టాస్ గెలిచిన కెప్టెన్ జులన్ గోస్వామి.. ప్రత్యర్థి పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత మహిళా బౌలర్లు ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇదిలా ఉంటే... మంగళవారం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్‌ను ఈఎస్‌పీఎన్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వార్మప్ మ్యాచ్‌లలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలను మట్టిగరిపించిన భారత్, తొలి లీగ్ మ్యాచ్‌లో పాక్‌ను చిత్తుచేసి విజయపథంలో దూసుకెళ్లింది.
ఇదే ఊపులో ఇంగ్లండ్‌ను కూడా ఓడించి, సూపర్ సిక్స్‌కు ముందుగానే బెర్తును ఖరారు చేసుకోవాలని భారత్ తహతహలాడుతోంది. కాగా, ఇదే మహిళల ప్రపంచకప్‌లో భాగంగా... ఆదివారం న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో, ఆసీస్ 14 పరుగుల తేడాతో కివీస్‌పై విజయం సాధించింది.