మహిళా ప్రపంచకప్ ఇంగ్లాండ్ జట్టు కైవసం చేసుకుంది. సిడ్నీలోని ఓవల్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో మరో 23 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లాండ్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్ పుల్ఫోర్డ్ రూపంలో గట్టి ఎదురుదెబ్బతగిలింది. న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ టిఫెన్ (30), మెక్ గ్లాషన్ (21), బ్రౌన్ (25), డులన్ (48)లు మినహాయిస్తే మిగిలిన వారందరూ వరుసగా పెవిలియన్ దారి పట్టారు.
దీంతో న్యూజిలాండ్ 47.2 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో షా 4 వికెట్లు, మార్ష్ 2 వికెట్లు, బ్రంట్, గుహా, కోల్విన్, ఎడ్వార్డ్స్లు చెరో వికెట్ చొప్పున తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్లు శుభారంభం చేశారు.
ఓపెనర్లు టేలర్(39), ఆట్కిన్స్(40)లు రాణించారు. అయితే ఎస్సీ టెలర్ (21) ఔటయిన తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్సమెన్లు వరుసపట్టారు. ఎడ్వార్డ్స్ (10), గ్రీన్వే(8), మోర్గాన్‌లు క్రీజులో నిలబడలేకపోయారు. అయినప్పటికీ ఇంగ్లాండ్ విజయానికి చేరువలో నిలిచింది.
ఓపెనర్ల తమ బాధ్యతను నిర్వర్తించడంతో షా, కొల్విన్లు మిగిలిన పనిని పూర్తి చేశారు. దీంతో 46.1 ఓవర్లలోనే ఇంగ్లాండ్ జట్టు 167 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో డూలన్ 3, మేసోన్ 2 వికెట్ల చొప్పున తీసుకున్నారు.
కాగా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ వెన్ను విరిచిన ఇంగ్లాండ్ మహిళా జట్టు బౌలర్ షా ఎంపికైంది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు... ఈ టోర్నీ మొత్తం తన సత్తా చాటిన ఎస్సీ టేలర్‌కు లభించింది.