సిడ్నీలో జరుగుతున్న మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు హవా కొనసాగుతోంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ శ్రీలంక జట్టుపై 35 పరుగులు తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్-బీలో భారత్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ గోస్వామి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 137 పరుగులు సాధించింది. కాగా, లంక బౌలర్ల ధాటికి భారత టాప్ ఆర్డర్, మిడిలార్డర్ కుప్పకూలినా.. తెలుగుతేజం మిథాలీ రాజ్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. 120 బంతులు ఎదుర్కొన్న ఆమె ఒక బౌండరీతోపాటు 75 పరుగులు సాధించి, చివరి వరకు అజేయంగా నిలిచింది. చివర్లో గోస్వామి (24 నాటౌట్) మిథాలీకి చక్కటి సహకారాన్ని అందించింది.
ఆ తరువాత... 138 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాట్‌ఉమెన్ భారత బౌలర్ల జోరుకు క్యూ కట్టారు. దీంతో 44.2 ఓవర్లలో లంక 102 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో కౌలస్య 20, సిల్వా 21 పరుగులు మినహా, మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరును సాధించలేకపోయారు. భారత బౌలర్లలో హైదరాబాదీ బౌలర్ సుల్తానా 10 ఓవర్లు బౌలింగ్ చేసి 16 పరుగులిచ్చి, రెండు వికెట్లు తీసుకుంది. మ్యాన్ ఆఫ్‌ది ఉమెన్ అవార్డు మిథాలీరాజ్‌కు దక్కింది.