భారత్ తరపున ఆడకపోవడం బాధే..!: అమిత్ మిశ్రా
కరేబియన్ గడ్డపై ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్ పోటీల్లో భారత్ తరపున ఆడలేకపోవడం బాధేస్తోందని టీం ఇండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తెలిపాడు. ఇంకా ఫామ్లో ఉన్న తనకు సెలక్టర్లు ప్రపంచకప్ ట్వంటీ-20లో ఆడే అవకాశం కల్పించకపోవడంతో ఏమరుపాటుతో పాటు ఉద్వేగానికి లోనైయ్యానని మిశ్రా అన్నాడు. ట్వంటీ-20 ప్రపంచకప్లో తప్పకుండా ఆడుతాననే ఉత్సాహంతో ఉన్నానని, కానీ తనకు జట్టులో స్థానం దక్కకపోవడం ఎంతో బాధేసిందని మిశ్రా చెప్పాడు. ప్రస్తుతం బౌలింగ్లో ఫామ్లో ఉన్నానని, కౌంటీ క్రికెట్లో ఆడే అవకాశం వచ్చిందని, కానీ బీసీసీఐ అనుమతి కోసం ఎదురుచూస్తున్నానని మిశ్రా చెప్పుకొచ్చాడు. బీసీసీఐ అనుమతిస్తే ట్వంటీ-20లో తన సత్తా ఏమిటో నిరూపించుకుంటానని అమిత్ మిశ్రా ధీమా వ్యక్తం చేశాడు. ఇంకా తన బౌలింగ్ విధానంపై పలువురు చేసే విమర్శలను దృష్టిలో పెట్టుకుని ట్వంటీ-20 జట్టులో స్థానం కల్పించకపోవడం శోచనీయమని మిశ్రా అన్నాడు. తన బౌలింగ్ తీరుపై ఎవరెన్ని విమర్శలు చేసినా.. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, భజ్జీ, ధోనీ వంటి సీనియర్ ఆటగాళ్లు ఎంతో ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో అధిక వికెట్లు పడగొట్టిన అమిత్ మిశ్రాను సెలక్టర్లు పక్కనబెట్టి పియూష్ చావ్లాను ప్రపంచకప్ ట్వంటీ-20కి ఎంపిక చేశారు. ఇంకా ప్రజ్ఞాన్ ఓజాకు కూడా సెలక్టర్లు వరల్డ్ కప్లో అవకాశం ఇవ్వలేదు.